దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది.ఆరు రాష్ట్రాలతో సరిహద్దులను కర్ణాటక కలిగివుంది.తూర్పున ఆంధ్రప్రదేశ్,పశ్చిమాన గోవా,ఉత్తరాన మహారాష్ట్ర,దక్షిణాన కేరళ,ఈశాన్యంలో తెలంగాణ,ఆగ్నేయంలో తమిళనాడు రాష్ట్రాలతో సరిహద్దులను కలిగి ఉండడంతో ప్రస్తుత ఎన్నికలలో ఈ ప్రభావం కన్నడ సీమలో రసవత్తర రాజకీయాలకు తెరలేపింది.
దీనిని బట్టి చూస్తే కన్నడ సీమలో రాజకీయాలపై ఇతర భాషలు మాట్లాడే ప్రజల ప్రభావం కనిపించడంతో పాటు ఈ రాష్ట్రంలో కన్నడేతర జనాభా ఎక్కువ సంఖ్యలో ఉండడం వలన ఆయా వర్గాల రాజకీయ ప్రాతినిధ్యానికి బీజం వేసినట్లు కర్ణాటక రాష్ట్రం ఉంది.
భౌగోళికంగా ఆరు రాష్ట్రాలతో సరిహద్దులను కలిగిఉన్న కర్ణాటక రాష్ట్రంలో మరో తొమ్మిది రోజుల్లో జరగనున్న ఎన్నికలలో ఈ ఆరు రాష్ట్రాల నాయకుల మరియు కన్నడ సీమలో నివసిస్తున్న ఆయా రాష్ట్రాల ప్రజల ఓట్లు అన్నీ పార్టీలకు కీలకం కానున్నాయి.వారి ఓట్లను ప్రసన్నం చేసుకోవడం కోసం అన్నీ రకాల పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ జిమ్మిక్కులు ప్రయోగిస్తూ వినూత్న ప్రయత్నాలు సాగిస్తూ ఎవరికీ వారు ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో బిజీ అయిపోయారు.
అతి త్వరలో జరగబోయే కన్నడ సీమ ఎన్నికలలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు వ్యక్తులు దాదాపుగా వందమందికి పైగా పోటీ చేస్తున్నారు.మరాఠా మూలాలను కలిగి ఉన్న వారి సుమారుగా యాభై మందికి పైగా పోటీ చేస్తున్నారు.తమిళులు ఈసారి పదిమందికి పైగా పోటీ చేస్తున్నారు.కర్ణాటక రాష్ట్రంలో కన్నడ మరియు ఉర్దూ భాషల తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. బీదర్,కలబురిగి, యాద్గిర్,రాయచూర్ జిల్లాల్లో తెలుగు మాట్లాడే వారు అత్యధికంగా ఉన్నారు.ఈ నాలుగు జిల్లాలు మన తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి.